
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి, వెలుగు : జనగామ జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులను దేవాదుల నీటితో నింపకపోవడం వల్లే భూగర్భజలాలు అడుగంటాయని, సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌తో పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే అందులో 40 శాతం ఎండిపోయిందన్నారు. దేవాదుల నీటిని సకాలంలో విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. సర్కారు నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.
ఎండిన పంటలకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 16న ఘన్‌పూర్‌లో జరిగే సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకావడం లేదని, రుణమాఫీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాను సక్సెస్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లాలోని పలు మండలాల్లో ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, యాదగిరి, రమేశ్, విజేందర్, ఉపేందర్, నరేందర్ పాల్గొన్నారు. అలాగే రఘునాథపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.